ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 7:43 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా, జవాబుదారితనంతో అమలు చేయాలి,రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా, జవాబుదారితనంతో అమలు చేయాలి,రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల.

అర్జున్ సమాచారం. అక్టోబర్ 09. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లా:అక్టోబర్ 9, 2026:ప్రజలకు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా అందించడంతో పాటు, ప్రభుత్వ శాఖలలో జవాబుదారితనాన్ని పెంపొందించేలా సమాచార హక్కు చట్టం–2005ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అన్నారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాలు–2026ను పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుభాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డి.జి.పి. సి.వి. ఆనంద్, పి.సి.సి.ఎఫ్. వినయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బెనహర్ మహేష్ దత్, రాష్ట్ర సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల సమీకృత కలెక్టరేట్‌లలోని సమావేశ మందిరాల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాచార హక్కు చట్టంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలకు సమాచారం అందించడం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల పనితీరులో జవాబుదారితనం పెరుగుతాయని తెలిపారు. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అధికారులు, పౌర సమాజంపై ఉందని తెలిపారు. చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ, నిర్ణీత గడువులోగా దరఖాస్తులకు సమాధానాలు అందించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయిలోనూ సమాచార హక్కు చట్టంపై అవగాహనను పెంపొందిస్తూ, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.అనంతరం సమాచార హక్కు చట్టం–2005ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజలకు చట్టబద్ధంగా అందించవలసిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందిస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ శాఖలలో సమాచార నిర్వహణను మెరుగుపరచడం, ప్రజలకు సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడం, చట్టం పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించడంపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర సమాచార కమిషన్ అందిస్తున్న సేవలు, సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించిన అంశాలను వివరించే ‘సమాచార దర్పణం’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి అవార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్ పాండే, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.